రాష్ట్రాల సమాహారమై భారతావని విలసిల్లుతుందని రాజ్యాంగంలోని మొట్టమొదటి అధికరణ ఉద్ఘోషిస్తుండగా- సువ్యవస్థిత సమాఖ్య భావనల పునాదులపై పార్లమెంటరీ ప్రజాతంత్రం వర్ధిల్లుతుందని రాజ్యాంగ నిర్మాతలూ తలపోశారు. నేటి వాస్తవం వేరు. ఆమధ్య ‘ప్రభుత్వమంటే నేనే’నంటూ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుగా నజీబ్ జంగ్ నోరు పారేసుకోవడం పరికించి ఎందరో నివ్వెరపోయారు. తాజాగా కేరళ, పశ్చిమ్ బంగ గవర్నర్ల చుట్టూ వివాదాలు ముదురుతుండటం- సమాఖ్య భావన బీటలు వారడానికి రాజ్‌భవన్లే పుణ్యం కట్టుకుంటున్న వైనాన్ని కళ్లకు కడుతోంది.
వేడెక్కిన రాజకీయాలు..
తాను రబ్బరు స్టాంపును కానంటున్న కేరళ ప్రథమపౌరుడు ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్, కేంద్రం రూపొందించిన శాసనాలను సమర్థించడాన్ని స్వీయ బాధ్యతగా పేర్కోవడం విస్తుగొలుపుతోంది. తనకు చెప్పకుండా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నివేదిక సమర్పించాలని అక్కడి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించడం, కేరళలో వేడెక్కిన రాజకీయానికి నిదర్శనం. అటు పశ్చిమ్ బంగలో పలు ఘాటు ఆరోపణలకు, తీవ్ర విమర్శలకు చిరునామాగా గవర్నరు జగ్‌దీప్ ధంకర్ నామధేయం మార్మోగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలను బహిరంగంగానే తప్పుపడుతున్న ఆయనకు జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ‘భాజపా కార్యకర్త ధంకర్ గోబ్యాక్!’ అనే ప్లకార్డులు ఎదురయ్యాయి. రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్రాల్లో గవర్నర్లు నిర్వహించాల్సిన రాజ్యాంగ విహిత బాధ్యతలు పరిమితమైనవి, నామమాత్రమైనవి. ఏదైనా రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు తెరపైకి వచ్చి అత్యవసరంగా విధ్యుక్తధర్మం నిర్వర్తించాల్సిన గవర్నర్లు మేరమీరి తామే సంచలనాలకు కేంద్రబిందువుగా మారితే ఎలాగుంటుందో కేరళ, పశ్చిమ్ బంగల ఉదంతాలు సోదాహరణంగా చాటుతున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లోనూ భాజపా మినహా తక్కిన పార్టీల మూకుమ్మడి స్పందన- గవర్నర్ల రాజకీయంపట్ల ప్రజాస్వామ్య హితైషుల ఆందోళనకు ప్రతిధ్వని!
ఉన్నత వ్యవస్థలోనే..
‘రాజకీయ నాయకులైతే సొంత కార్యకలాపాల నిమిత్తం మరింత అధికార పరిధిని వాంఛిస్తారు... విద్యావేత్తలో ఇతర రంగాల నిపుణులో అయితే ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తారు...’ రాజ్‌భవన్లలో కొలువు తీరాల్సినవారిపై రాజ్యాంగ నిర్ణయ సభలో పండిత నెహ్రూ విశ్లేషణ అది. గవర్నర్ల వ్యవస్థ ఎంత ఉన్నతంగా ఉండాలన్న దానిపై ఆనాడు ఆదర్శాలెంతగా మిన్నంటినా, కేంద్రంలో దశాబ్దాల కాంగ్రెస్ పాలన- రాష్ట్ర ప్రథమ పౌరుల చేతుల మీదుగా శీలహీన రాజకీయాలు సాగించే క్షీణ సంస్కృతికి అంటుకట్టింది. లోగడ బిహార్ శాసనసభ రద్దు ఉదంతంలో గవర్నరుగా బూటాసింగ్ పాత్రను, కేంద్ర మంత్రివర్గం వైఖరిని న్యాయపాలిక పరుషంగా దుయ్యబట్టింది.
రాజ్యాంగ ప్రతినిధిగా గవర్నర్ల వ్యవస్థకు వన్నెలద్దిన జాకీర్ హుస్సేన్, సరోజినీ నాయుడు, బర్నాలా వంటివారు లేకపోలేదు. వారితో పోలిస్తే ప్రజాస్వామ్య పిండారీలుగా భ్రష్టుపట్టిన రామ్‌లాల్, సిబ్తెరజీ, భండారీలదే సంఖ్యాధిక్యత! గవర్నర్లకు కేంద్ర అమాత్యులుగా, మంత్రులకు గవర్నర్లుగా వేషం కట్టడంలో యూపీఏ రాటుతేలిపోగా- రాజ్‌భవన్లను అడ్డుపెట్టుకుని, భాజపాయేతర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే విద్యలో ఎన్డీయే జమానా సైతం ‘ప్రజ్ఞ’ కనబరుస్తోంది. కేరళ, పశ్చిమ్ బంగ వంటిచోట్ల ప్రజ్వరిల్లుతున్న రాజకీయ రచ్చ అందుకు ప్రబల దృష్టాంతం. స్థానిక సంస్థల్లో సభ్యుల సంఖ్య పెంపుదలకు ఉద్దేశించిన అత్యవసర ఆదేశాన్ని (ఆర్డినెన్సును) తొక్కిపట్టిన ఆరిఫ్ ఖాన్, పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కేరళ సర్కారును బోనెక్కిస్తున్నారు. అడుగడుగునా కొర్రీలతో పశ్చిమ్ బంగ ప్రభుత్వ సహనానికి జగ్‌దీప్ అనుదినం పరీక్ష పెడుతున్నారు. ఇదా గవర్నరు పీఠం గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా కాచుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సౌహార్ద బాంధవ్యాన్ని పరిరక్షించే తీరు?
విలువలకు తిలోదకాలు..
రాజకీయ రంగుటద్దాలు తొడిగి రాజ్‌భవన్ల పరువు ప్రతిష్ఠలకు తూట్లు పొడవడంలో అన్ని పార్టీలదీ తిలాపాపం తలా పిడికెడు. యూపీలో కాంగ్రెస్ వైరి భాజపా అధికారాన్ని ఊడబెరకడానికి రమేశ్ భండారీ తహతహలాడగా- బిహార్‌లో కమలనాథుల ప్రత్యర్థి అయిన లాలు పార్టీ సర్కారు పీక నులమడానికి సుందర్ సింగ్ భండారీ అన్ని విలువలకూ తిలోదకాలు వదిలేశారు. మొన్నామధ్య జమ్మూ కశ్మీర్ గవర్నరుగా సత్యపాల్ మాలిక్ ఉన్నట్లుండి అక్కడి శాసనసభను రద్దు చేయడానికి ప్రేరణ- భాజపా వ్యతిరేక మహా కూటమిగా పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఏకతాటిపైకి రావడమేనన్నది బహిరంగ రహస్యం. చరిత్రాత్మక బొమ్మై కేసులో- పార్టీ విధేయతలకు అతీతంగా, నిష్పాక్షికంగా తమ కర్తవ్యం నిర్వర్తించాలని గవర్నర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఉద్బోధించింది.
అంతకుముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై విస్తృత అధ్యయనంలో భాగంగా- గవర్నర్ల పనితీరు ఎలా ఉండాలో సర్కారియా కమిషన్ విపుల సిఫార్సులు వెలువరించింది. సొంత పార్టీ అజెండాకు లోబడి వ్యవహరిస్తున్న గవర్నర్ల పక్షపాత బుద్ధి కారణంగానే రాజకీయ సంక్షోభాలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తించి, దిద్దుబాటు చర్యలు సూచించిన సర్కారియా కమిషన్ నివేదికను ప్రభుత్వాలు అటకెక్కించాయి. ఆ అలసత్వం తాలూకు దుష్పరిణామాల పర్యవసానంగా దేశంలో రాజ్యాంగ సంవిధాన స్ఫూర్తే కదలబారుతోందిప్పుడు!
వంకపెట్టలేని దక్షులు కావాలి...
దాదాపు తొమ్మిదేళ్ల క్రితం కేంద్ర నిఘా సంఘం (సీవీసీ) అధిపతిగా పీజే థామస్ నియామకాన్ని తోసిపుచ్చుతూ, వ్యవస్థకు దీటైన నైతిక నిష్ఠ కలిగిన వ్యక్తినే ఎంపిక చేయాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సత్సంబంధాల నిర్మాణ వారధులు కావాల్సిన గవర్నర్ల అధికారాలు, బాధ్యతలను విస్పష్టంగా నిర్వచించి, ఎవరూ వంకపెట్టలేని దక్షుల్ని కొలువుతీర్చేలా విధి విధానాల్ని ప్రక్షాళించి సజావుగా అమలు పరిస్తేనే- రాజ్‌భవన్లకు రాజకీయ గ్రహణం పీడ విరగడవుతుంది!