కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులతో గురువారం తన నివాసంలో భేటీ అయ్యారు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దాలి? సుపరిపాలన ఎలా అందించాలి? వంటి అంశాలపై చర్చించారు.
ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాల సీఎంలు అమరీందర్‌సింగ్ (పంజాబ్), అశోక్ గహ్లోత్ (రాజస్థాన్), కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), నారాయణ స్వామి (పుదుచ్చేరి), రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ హాజరయ్యారు.
"ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది. ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతోందనే అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన కార్యకర్తలను పాలనలో ఎలా భాగస్వాములను చేయాలి. చాలా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉండటం, పారదర్శకత, సున్నితమైన పాలనను అందించడం వంటి అంశాలపై ఆయా రాష్ట్రాల సీఎంలతో సమావేశంలో చర్చించాం."
-సచిన్ పైలట్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి
పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జ్లు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలోనూ ఈ అంశాలపైనే చర్చించారు సోనియా. పారదర్శకత, జవాబుదారీ కలిగిన పాలనకు ఉదాహరణగా చూపే విధంగా ఆయా రాష్ట్రాలను తీర్చిదిద్దాలని సోనియా వారికి దిశానిర్దేశం చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని యోచిస్తోంది.
ఇదీ చూడండి: ఇక యూపీ మంత్రులూ ఆదాయ పన్ను కట్టాల్సిందే..!