పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్ రాజౌరీ జిల్లాలో నియంత్రిణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను మరణించినట్లు అధికారులు తెలిపారు. ఓ సైనికాధికారితో పాటు మరో జవాను గాయపడినట్లు వెల్లడించారు.
సుందర్బని సెక్టార్లో పాక్ బలగాలు చేసిన కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని అధికారులు స్పష్టం చేశారు. 'చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్లింగులతో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. ఇందులో కొంతమందికి గాయాలయ్యాయి.' అని ప్రాథమిక సమాచారం ఆధారంగా ఓ ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. అనంతరం.. ముగ్గురికి గాయాలు కాగా.. ఓ జవాను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
గాయపడిన సైనికాధికారితో పాటు మరో జవాను ప్రస్తుతం సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. పాక్ వైపు కూడా ప్రాణనష్టం జరిగిందని పేర్కొన్నారు. అయితే దీనిపై పూర్తి సమాచారం లేదన్నారు.