ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ ఆరోగ్య కార్డు పథకం ప్రయోజనాలపై జాతీయ ఉత్పాదకత మండలి( ఎన్పీసీ) ఓ సర్వే చేసింది. భూ ఆరోగ్య కార్డు సూచించిన సలహాలు, సూచనలు పాటిస్తే ఎకరాకు 30వేల ఆదాయం పెరుగుతుందని తెలిపింది. అయితే పంటలను బట్టి ఆదాయంలో మార్పులు ఉంటాయని వెల్లడించింది. రైతులకు వారి నేల పోషక స్థితిపై సమాచారం అందించడం భూ ఆరోగ్య కార్డు పథకం ఉద్దేశ్యం.
19 రాష్ట్రాల్లో..
భూ ఆరోగ్య కార్డు ప్రయోజనాలపై దేశంలోని 19రాష్ట్రాల్లోని 76 జిల్లాల్లో అధ్యయనం చేసినట్లు ఎన్పీసీ సర్వే తెలిపింది. భూ ఆరోగ్య కార్డులు లేనప్పుడు మోతాదుకు మించి ఎరువులు వినియోగించినట్లు రైతులు గుర్తించారని వివరించింది.
భూ ఆరోగ్య కార్డులోని సూచనలను పాటించడం వల్ల ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గి, ఉత్పాదకత పెరిగిందని వివరించింది.
ఎకరాకు ఆదాయం..
-తుర్ పప్పుపై 25వేల నుంచి 30వేలు
- పొద్దుతిరుగుడు పంటపై 25వేలు
- పత్తి పంటపై 12వేలు
- వేరుశనగపై పదివేలు
- వరిపంటపై 4,500
- ఆలు పంటపై 3వేలు
ఈ పథకం కింద 2 సంవత్సరాలకు ఒకసారి రైతులకు భూ ఆరోగ్య కార్డులను కేంద్రం జారీ చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం రెండుసార్లు మాత్రమే కార్డులను అందజేసింది.
తాజాగా భూ ఆరోగ్య కార్డు పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా దత్తత గ్రామాల్లో ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే భూ పరీక్ష కేంద్రాలను కూడా భారీగా పెంచాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పథకానికి సంబంధించి సమాచారం కోసం.. ఓ పోర్టల్‌ను 21 భాషల్లో అందుబాటులో ఉంచింది ప్రభుత్వం.