వాట్సాప్ మెసెంజర్లో.. ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను చొప్పించి ప్రముఖుల ఫోన్ల సమాచారాన్ని కేంద్రం విశ్లేషించిందన్న వార్తలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. పెగసస్ సాఫ్ట్వేర్ ద్వారా మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారాన్ని గమనించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్య చట్టవ్యతిరేకమని వ్యాఖ్యానించారు సోనియా.
భారత ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని.. సంబంధిత మెసేజింగ్ యాప్‌ను వివరణ కోరాలని డిమాండ్ చేశారు. వాట్సాప్ యాప్ లోకి చొప్పించిన పెగసస్ సాఫ్ట్వేర్ గురించి సోనియా గాంధీ మాట్లాడటం ఇదే తొలిసారి.
"సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలపై ఇజ్రాయెల్‌లో తయారైన పెగసస్ సాఫ్ట్వేర్ ద్వారా మోదీ ప్రభుత్వం గూఢచర్యం చేసిందని బయటపడటం విస్మయానికి గురిచేసింది."
-సోనియా గాంధీ ప్రకటన
ఈ అంశమై కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విపక్షనేతలు.. సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేయాలన్నారు.
నాటి ఫోన్ ట్యాపింగ్‌కు కారకులెవరు?
వాట్సాప్ మెసెంజర్‌లోకి చొప్పించిన పెగసస్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందన్న ఆరోపణలపై భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. నాడు యూపీఏ ప్రభుత్వంలో ప్రణబ్ ముఖర్జీ, ఆర్మీ ప్రధానాధికారి వీకే సింగ్‌ల ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారంటూ ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని వెల్లడించిందని వ్యాఖ్యానించారు.
"కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రణబ్ ముఖర్జీ, నాటి ఆర్మీ ప్రధాన అధికారి వీకే సింగ్‌ల ఫోన్లను.. 10 జన్‌పథ్‌లో ఎవరు ట్యాప్ చేశారో సోనియాగాంధీ... ప్రజలకు తెలపాలి."
-జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఇదీ చూడండి: ఆరుబయటకు చెంబు పట్టుకెళితే.. రేషన్ కట్