అక్టోబర్‌లో జరగనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశానికి తమిళనాడులోని మామళ్లపురం తీరప్రాంతం సిద్ధమవుతోంది. భేటీ సందర్భంగా ఇక్కడి చారిత్రక షోర్ దేవాలయాన్ని అగ్రనేతలు సందర్శించనున్నారు. ఇందుకు దేవాలయం అంగరంగ వైభంగా ముస్తాబవుతోంది.
జిగేలుమనిపించే కాంతులు, పచ్చదనంతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. పర్యటన జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోవడానికి.. అగ్రనేతలు ఫొటోలు దిగేందుకు అనువైన ప్రదేశంగా ఈ ఆలయం మారనుంది.
ఇప్పటికే పురావస్తుశాఖ అధికారులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రకాశవంతమైన లైటింగ్‌తో పాటు, అవసరమైన చోట కొత్త రాతి ఫ్లోరింగ్నూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటితో పాటు ఇద్దరు నేతలు అక్కడే ఉన్న ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు.
ఆలయ ప్రత్యేకతలు
పరమేశ్వరుడు కొలువై ఉన్న షోర్ దేవాలయం క్రీ.శ 700-728( పల్లవ రాజసింహ) కాలానికి చెందినది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో వీక్షకుల మనసులను ఆకట్టుకుంటుందీ ఆలయం. తీర ప్రాంతంలో ఉన్నందువల్ల ఈ గుడిని షోర్ ఆలయం అని పిలుస్తారు.