ఆదాయపు పన్ను శాఖ తనకు నోటీసులు జారీ చేసినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌కు సంబంధించి వీటిని పంపించినట్లు చెప్పారు. పోల్ అఫిడవిట్‌పై వివరణ కోరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"ఈ నోటీసులు నిన్న వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఆదేశించిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మాకు నోటీసులు జారీ చేసింది. దీనిపై మా స్పందన తెలియజేస్తాం. సభ్యులందరిలో మాపైనే వారు(కేంద్ర ప్రభుత్వం) ప్రేమ చూపించినందుకు సంతోషంగా ఉంది."
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
తనతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, తన కుమార్తె, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే సైతం నోటీసులు అందుకున్నారని పవార్ తెలిపారు.
రాష్ట్రపతి పాలనపై
మరోవైపు.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించనున్నారనే వార్తలను పవార్ తీవ్రంగా ఖండించారు.
"రాష్ట్రపతి పాలన విధించడానికి ఏదైనా కారణం ఉందా? రాష్ట్రపతి పాలన ఏమైనా హాస్యాస్పదమా? మహా వికాస్ ఆఘాడీకి రాష్ట్ర అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉంది."
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడాన్ని పవార్ తప్పుబట్టారు.