ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటం ప్రజల ప్రాథమిక హక్కు అయినప్పటికీ ఉద్యమాలకు సంయమనం అవసరమని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. రహదారులను దిగ్బంధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించింది. సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీ షాహీన్భాగ్లో జరుగుతున్న ఆందోళనలపై న్యాయవాది అమిత్ సాహ్నీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, సాధన రామచంద్రన్‌ను మధ్యవర్తులుగా నియమించింది సుప్రీంకోర్టు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగని చోట నిరసన తెలిపేలా ఆందోళనకారులను ఒప్పించాలని సూచించింది. ఒకవేళ ఫలితం లేకుంటే నిర్ణయాధికారం అధికారులకే వదిలేస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.
వాదనల సందర్భంగా
అభిప్రాయాలను వ్యక్తీకరించడం ఆధారంగానే ప్రజాస్వామ్యం పనిచేస్తుందని... అయితే అందుకు కొన్ని హద్దులుంటాయని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ఓ అభ్యర్థనను న్యాయస్థానం ముందుంచారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. నిరసనలతో ప్రతి వ్యవస్థ లొంగిపోతుందనే సందేశాన్ని ఇవ్వకూడదని కోరారు. సుప్రీం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.
ప్రాథమిక హక్కుల సంగతేమిటి?
ఆందోళనల కారణంగా ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని మరో పిటిషన్ దాఖలు చేశారు భాజపా నేత నందకిషోర్ గార్గ్. షాహీన్‌భాగ్ నిరసనకారులను అక్కడినుంచి తరలించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ దిల్లీలోని షాహీన్ బాగ్‌లో గత రెండు నెలలుగా కొందరు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా నిరసన పేరుతో రోడ్లను నిర్బంధించడంపై దాఖలైన పిటిషన్లపైనే ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇదీ చూడండి: ఆప్: 'ఇదే సరైన తరుణం.. జాతీయ పార్టీగా ఎదుగుదాం'