మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా-శివసేన మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది శివసేన. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు సీనియర్ నేత సంజయ్ రౌత్.
" ఎన్డీఏ పక్షాల సమావేశానికి శివసేనకు చెందిన ప్రతినిధులు ఎవరూ హాజరుకారు. ఇదే తుది నిర్ణయం కావచ్చు."
-సంజయ్ రౌత్, శివసేన నేత.
శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వర్ధంతి ఆదివారం ఉండటమూ.. సమావేశానికి హజరుకాకపోవడానికి ఓ కారణంగా పేర్కొంది సేన. పార్టీ నేతలు, కార్యకర్తలు ఠాక్రేకు నివాళులర్పించే క్రమంలో సమావేశానికి ఎలా హజరవుతారని ప్రశ్నించింది.
నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్డీఏ) కూటమిలో సుదీర్ఘ కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది సేన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకునే విషయమై భాజపాతో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో కూటమి నుంచి బయటకి వచ్చినట్టు సమాచారం.
ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఈ మూడు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వానికి సేన నేతృత్వం వహించనుంది.
ప్రతిపక్షంలోకి సేన!
అరవింద్ సావంత్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయటం వల్ల ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది శివసేన. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సేనకు ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో శివసేన ఎంపీలు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్ కూర్చునే స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి నుంచి శివసేన స్థానాలు ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఉందని పార్లమెంట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ 'భారత్ బచావో'