మహారాష్ట్ర వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి స్వాగతించింది. రేపటి బలపరీక్షలో కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధీమాగా చెప్పారు. కూటమి గెలుపుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది అంబేడ్కర్‌కు నివాళి...
సుప్రీం తీర్పును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్వాగతించారు.
"ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించేలా.. భారత రాజ్యాంగ దినోత్సవం రోజు.. సుప్రీం ఇచ్చిన తీర్పునకు కృతజ్ఞతలు. ఇది డా. బీఆర్ అంబేడ్కర్‌కు నివాళి." - శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
30 నిమిషాలు చాలు...
సుప్రీంకోర్టు తీర్పుతో ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్న తమ విశ్వాసం నెగ్గిందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు బల నిరూపణ చేసుకునేందుకు 30 గంటలు గడువు ఇచ్చింది. 30 నిమిషాల్లోనే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి బలం ఉందని నిరూపిస్తాం.
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
రేపటితో ముగింపు...
రాజ్యాంగ దినోత్సవం రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్. రేపటితో భాజపా ఆట ముగిసిపోతుందని జోస్యం చెప్పారు.
బలం చూపిస్తాం...
బలపరీక్షపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని భారతీయ జనతాపార్టీ స్పష్టం చేసింది. రేపు జరిగే విశ్వాసపరీక్షలో తాము బలనిరూపణ చేసుకుంటామని... ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
రేపటి బలపరీక్ష కోసం ఇప్పటికే కూటమి నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా హోటళ్లలో సమావేశం నిర్వహించారు. అధికార భాజపా ఈ రోజు రాత్రి ముంబయి గార్వేర్ క్లబ్లో తమ ఎమ్మెల్యేలతో భేటీ కానుంది.
- ఇదీ చూడండి: 'మహా' బలపరీక్ష రేపే... సుప్రీంకోర్టు కీలక తీర్పు