కొద్ది రోజుల్లో వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలవరించనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). సుప్రీం ఇవ్వబోయే తీర్పును ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అంగీకరించాలని కోరింది. తీర్పు ఏవిధంగా వచ్చినా దేశంలో సామరస్యాన్ని కొనసాగించటం ప్రతి ఒక్కరి బాధ్యతని ట్విట్టర్ ద్వారా గుర్తుచేసింది.
"రామజన్మభూమిలో ఆలయం నిర్మాణంపై సుప్రీంకోర్టు రానున్న కొద్ది రోజుల్లో తీర్పు వెలువరించనుంది. తీర్పు ఏవిధంగా ఉన్నా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. దేశవ్యాప్తంగా సామాజిక సామరస్యాన్ని కొనసాగించేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత."
- ఆర్ఎస్ఎస్.
సుప్రీం కోర్టు తీర్పుపై దిల్లీలో రెండు రోజుల పాటు జరగనున్న సీనియర్ ప్రతినిధుల సమావేశంలో చర్చించనున్నట్లు ట్విట్టర్లో తెలిపింది ఆర్ఎస్ఎస్. తొలుత ఈ భేటీని నేటి నుంచి నవంబర్ 5 మధ్య హరిద్వార్‌లో జరిగే ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌ల సమావేశంతో పాటు జరపాలని నిర్ణయించారు. కానీ ప్రచారక్‌ల సమావేశం వాయిదా పడటం వల్ల సీనియర్ ప్రతినిధుల సమావేశాన్ని దిల్లీకి మార్చారు.
అయోధ్య వివాదాస్పద భూమిపై 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఈ విధంగా స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: లెక్కల చిక్కులు: మరో మిత్రపక్షంతో భాజపాకు ఇబ్బందులు!