యోగి ఆదిత్యనాథ్, మాయావతి ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. వీరిపై ఏం చర్యలు తీసుకున్నారో మంగళవారం చెప్పాలంటూ ఎన్నికల సంఘం ప్రతినిధికి సమన్లు జారీచేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయవతి విద్వేష ప్రసంగాలు చేశారన్న ఆరోపణల్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇందుకోసం ఈసీ ప్రతినిధి ఒకరు మంగళవారం కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీచేసింది.
ఎన్నికల ప్రచారంలో మతతత్వ ప్రసంగాలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యూఏఈ వాసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి.
యోగి, మాయావతికి ఇప్పటికే నోటీసులు జారీచేశామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. సంతృప్తి చెందని న్యాయస్థానం... ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఈసీ పరిమిత అధికారాలపై పరీక్ష...
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేందుకు తమకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయన్న ఈసీ వివరణను సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
"మాకు కోరలు(అధికారాలు) లేవని ఈసీ చెబుతోంది. నోటీసు, ఆ తర్వాత సలహా ఉత్తర్వు ఇవ్వగలమని, అనంతరం ఫిర్యాదు చేయగలమని ఎన్నికల సంఘం అంటోంది.
ఎన్నికల సమయంలో విద్వేష ప్రసంగాలు చేసేవారిపై చర్యలకు సంబంధించి ఈసీ అధికారాలను పరిశీలిస్తాం."
-సుప్రీంకోర్టు