మహారాష్ట్ర అసెంబ్లీ ఆదేశాల ధిక్కరణ కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ జరిగే వరకు అర్ణబ్‌ను అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు ధిక్కారం కింద షోకాజ్ నోటీసులు ఎందుకు జారీ చేయకూడదని సీజేఐ జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శించినందుకు అర్ణబ్పై మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ప్రత్యేక హక్కు నోటీసు ఇవ్వగా ఈ మేరకు కోర్టు స్పందించింది.
ఇప్పటికే అరెస్టు
2018లో 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతడి తల్లి ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారనే కేసులో బుధవారం రాయ్‌గఢ్ పోలీసులు అర్ణబ్‌ను అరెస్టు చేశారు. ఆయనకు జిల్లా కోర్టు రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.