అక్టోబర్ 4న జరగాల్సిన యూపీఎస్సీ ప్రాథమిక పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా వాయిదా వేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఈ మేరకు సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని 20మంది యూపీఎస్సీ ఆశావహులు వేసిన పిటిషన్పై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ కృష్ణమూర్తితో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 2021లో జరిగే పరీక్షలతో ప్రస్తుత(2020) పరీక్షలను నిర్వహించాలనే వాదనను కొట్టిపారేసింది. ఇలా చేయడం వల్ల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
వారికి మరో అవకాశం
అయితే చివరి ప్రయత్నంగా పరీక్ష రాసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం. కరోనా కారణంగా హాజరుకాలేని ఈ అభ్యర్థులకు మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించడాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.
పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని యూపీఎస్సీ ఇదివరకే కోర్టుకు తేల్చిచెప్పింది. ఇదివరకే ఓసారి పరీక్ష వాయిదా పడినందున మరోసారి అలా చేయడం కుదరదని స్పష్టం చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ధర్మాసనానికి వివరించింది.
దేశంలో కరోనాతో పాటు వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా రెండు నుంచి, మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.