బోరుబావుల్లో పడి చిన్నారులు చనిపోతున్న ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బోరుబావుల్లో పడిన పిల్లలు చనిపోకుండా చూడటంలో విఫలమైనందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది జీఎస్ మణి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
యంత్రాంగం విఫలమైంది...
2010 ఆగస్టులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. బోరుబావిలో పిల్లలు పడకుండా తీసుకున్న చర్యలకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి రికార్డులను పరిశీలించాలని న్యాయవాది మణి పిటిషన్లో కోరారు. బోరుబావులను ముసేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన బోరుబావి ఘటనలను మణి ప్రస్తావించారు.