'సోషల్ మీడియా యూజర్ ప్రొఫైళ్లకు ఆధార్ అనుసంధానం'పై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు... వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న సంబంధిత కేసులను తనకు బదిలీ చేసుకుంది. 2020 జనవరి చివరివారంలో ఈ కేసుల జాబితాను ధర్మాసనం ముందుకు తీసుకురావాలని రిజిస్ట్రీకి సూచించింది.
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడానికి అవసరమైన నిబంధనలపై జనవరిలో నివేదిక సమర్పించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు.
అనుసంధానం తప్పనిసరి!
సామాజిక మాధ్యమ యూజర్ ప్రొఫైళ్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ మద్రాసు, బొంబాయి, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో గతంలో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మద్రాసు హైకోర్టులో విస్తృత విచారణ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో అసత్య, అశ్లీల, దేశవ్యతిరేక, ఉగ్రవాద భావజాలం వ్యాప్తిని అడ్డుకునేందుకు... యూజర్ ప్రొఫైళ్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది.
అయితే... ఇలా చేస్తే వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఫేస్బుక్ వాదించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫేస్బుక్ అభ్యర్థన మేరకు సంబంధిత కేసులన్నింటినీ తనకు బదిలీ చేసుకుంది సర్వోన్నత న్యాయస్థానం.