దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. వీడియో కాన్ఫరెన్స్ విచారణ సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు నల్లకోటు, పొడవాటి గౌను ధరించకూడదని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. వైరస్ను నిర్ములించే ఔషధాలు వచ్చే వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. వాటిని ధరించడం వల్ల వైరస్ సులభంగా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
"వైరస్ వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో.. వైద్యుల సలహాలను పరిగణలోకి తీసుకుని అందరికీ ఈ సమాచారం తెలియజేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న కేసు విచారణ సమయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు 'సాధారణ తెలుపు చొక్కా లేదా తెలుపు సల్వార్ కమీజ్ లేదా తెలుపు చీర, సాధారణ తెలుపు టై'ని ధరించాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది." -సుప్రీంకోర్టు ఉత్తర్వులు
విచారణ సమయంలో...
బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కేసు విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ హృషికేశ్ రాయ్ నల్లకోటు ధరించకుండా కనిపించారు. ఆ సమయంలో సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. కొంత కాలం వరకు విచారణల్లో అసలు కోటు ధరించకూడదని ధర్మాసనం ప్రకటించింది.
ఇదీ చూడండి: 'ఆర్థిక ప్యాకేజీతో వ్యాపారుల సమస్యలు మాయం'