పొరపాటున ఇంజనీరింగ్ సీటు రద్దు చేసుకున్న 18ఏళ్ల యువకుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనికి తక్షమే మధ్యంతర అడ్మిషన్ ఇచ్చి.. కళాశాలలో చేర్చుకోవాలని ఐఐటీ బాంబేకు ఆదేశాలిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.
తప్పు లింక్ వల్లే!
ఆగ్రాకు చెందిన 18ఏళ్ల సిద్ధాంత్ బాత్రా.. ఈ ఏడాది జరిగిన జేఈఈ ఎడ్వాన్సడ్ పరీక్షలో ఆల్ ఇండియా 270 ర్యాంకను దక్కించుకున్నాడు. ఐఐటీ బాంబేలో ఎలక్ట్రానికి ఇంజినీరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి సీటు కూడా వచ్చింది. కానీ అక్టోబర్లో ఓ తప్పు లింక్ మీద క్లిక్ చేయడం వల్ల తన సీటును తానే ఉపసంహరించుకున్నాడు.
తనను చేర్చుకోమని ఐఐటీ-బీకి వెళ్లగా యంత్రాంగం తిరస్కరించింది. అనంతరం ఆ యువకుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అతడి పిటిషన్ను కొట్టివేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆ తర్వాత.. తనకు న్యాయం చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఐఐటీ బాంబేకు నోటీసులు జారీ చేసి.. విద్యార్థికి మధ్యంతర అడ్మిషన్ అవకాశాన్ని కల్పించాలని వెల్లడించింది. తదుపరి విచారణను శీతాకాలం విరామం తర్వాతకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి:- కేర్టేకర్పై మోసం కేసు పెట్టిన సీజేఐ తల్లి