ఇప్పుడంటే ఆచారం అనే మాటకు చాదస్తం అనే పెడర్థం తోస్తోంది గాని, క్రమపద్ధతిలో జీవిస్తూ, చక్కగా శుచి శుభ్రతలు పాటించేవారిని ఒకప్పుడు ఆచారవంతులుగా భావించేవారు. శౌచం అనే మాటకు శుచిగా, పరిశుభ్రంగా ఉండటమని అర్థం. శౌచం మనిషి ఆయుర్దాయాన్ని పెంచుతుందని పరమశివుడు పార్వతితో చెప్పినట్లుగా భారతంలో ఉంది. ‘క్షమయు సత్యంబు కృపయు శౌచమును గురులవలని భక్తియు... ఆయువు పొలుపు(వృద్ధి) నిచ్చు’ అని ఆనుశాసనిక పర్వం తేల్చిచెప్పింది. నిత్యజీవితంలో శౌచాన్ని పాటించేవారిని, పరిశుభ్రంగా ఉండేవారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుందని మారనకవి మార్కండేయ పురాణంలో వివరించాడు.
శుచి శుభ్రతలే ముఖ్యం..
నిత్యసత్యులు, శౌచ నిరతులు గురుభక్తులు సత్కర్మపరులు...’ ఎక్కడుంటారో అక్కడ నేను ‘ప్రీతి నా వసియించు నిక్కలు...’ ఇష్టంగా స్థిరపడతానని స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది. కనుక శుచి శుభ్రతలు అటు ఆరోగ్యానికి, ఇటు సౌభాగ్యానికి ప్రోత్సాహకాలని ప్రజల ప్రగాఢ విశ్వాసం. వాటిని తు.చ. తప్పక పాటించడమే ఆచారం. అధికారులకు అర్జీలు పెడుతూ ‘మహారాజశ్రీ’ అంటూ ప్రారంభిస్తాం. పేరు ముందు సరితూగేవి నిజానికి అవి కావు. ‘అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు...’ అంటూ కలియుగంలోని జనం జాతకాలన్నీ బయటపెట్టింది భాగవతం. ఏదైనా మనదాకా వస్తేగాని మేల్కొనక పోవడం అలసత్వం. మనదాకా రాదులే అనుకోవడం మందబుద్ధి. రాకుండానే ఆ రోగలక్షణాలను మనకు ఆపాదించుకొని అనుమానంతో భయంతో వణికిపోవడం ఆయుక్షీణం. కనుక మనపట్ల భాగవతం చెప్పిన విశేషణాలే సరైనవి. ప్రాణం మీదకొస్తే తప్ప శుచి శుభ్రత గుర్తుకు రానివారిని మందభాగ్యులనే అనాలి మరి!
శాస్త్రాలు అవే చెబుతాయి..
లోకంలో దివ్య భౌమ అంతరిక్ష సంబంధంగా మూడురకాల ఉత్పాతాలు సంభవిస్తాయని శాస్త్రం పేర్కొంది. వాటిని ‘త్రివిధోత్పాతాలు’ అంటారు. మసూచికం, కలరా వంటి అంటురోగాలను దివ్యోత్పాతాలుగా చెబుతారు. కార్చిచ్చు భూకంపాదులు భౌమోత్పాతాలు. అతివృష్టి, అనావృష్టి, కరవు కాటకాదులు అంతరిక్ష ఉత్పాతాలు. చాలా ముందుగానే వీటిని ఊహించే పరిజ్ఞానం ఆ రోజుల్లో ఉండేది. ఉదాహరణకు కరవెప్పుడొస్తుందో వరాహపురాణం చెప్పింది. ‘మీనంబునకున్ (మీనరాశిలోకి) పూషాత్మజుండు (సూర్యపుత్రుడైన శనీశ్వరుడు) వచ్చిన దోషంబున చేసి కరవు తోడన్ వచ్చెన్’ అంది. అలా ‘మీనంబున శని యుండిన వానలు పైరులు చెడి’పోవడమే కాదు, ‘నానా దేశములందును భూనాథులు సంగరమున పొలియుదురు (మరణిస్తారు)...’ అంటే యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.
అవే నివారణోపాయాలు..
శాస్త్రపండితులు గ్రహించి ముందస్తు హెచ్చరికలు చేసేవారు. పరిష్కారమార్గాలు, శాంతికర్మలు సూచించేవారు. అప్పటి పద్ధతులను బట్టి భుక్తి బలి హోమ విధుల్లో తగిన నివారణోపాయాలు పాటించేవారని ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు చెప్పాడు. ‘అవనీసురముఖ (వేదవేత్తల ద్వారా జపతపాదులు) సురముఖ (దేవాలయాలు పునరుద్ధరించి అర్చనలతో దేవతలను సంతృప్తిపరుస్తూ) పవనసఖముఖముల (యజ్ఞయాగాదులతో అగ్నిని ఆరాధిస్తూ) భుక్తి బలి హోమ విధిన్’ తగు చర్యలు చేపట్టేవారు. ‘త్రివిధోత్పాతములు ఒదవిన అవని విభుడు విడువ వలయు అధిక ద్రవ్యంబుల్’ అంటూ కృష్ణరాయలు సూచించాడు. ఆపత్సమయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తూ విరివిగా సొమ్ము వెచ్చించి ప్రజలను ఏదో విధంగా ప్రమాదం నుంచి గట్టెక్కించడం ప్రభువుల కర్తవ్యమని ఆయన స్పష్టం చేశాడు.
దండం పెట్టినా వినతపోతే దండించడమే..
దేవతలు ఆగ్రహించడమే ఉత్పాతాలకు మూలకారణమని ఆ రోజుల్లో నమ్మేవారు కనుక నివారణ చర్యలూ ఆ మార్గంలోనే సాగేవి. ఇది ఆధునిక యుగం. ఆవరిస్తున్న అంటురోగాలూ ఆధునికమైనవే. ‘దండం పెట్టినా వినకపోతే దండించడమే సరి’ అని సామెత. ఇప్పుడు లోకాన్ని ఒక మహమ్మారి దండిస్తోంది. అంటు సొంటు మడి తడి అడుగడుగునా పాద హస్త ప్రక్షాళనాలు... వంటివన్నీ పరమ చాదస్తాలని పరిహసించిన ఆధునిక జీవనశైలిని మృత్యుపాశంతో బెదిరిస్తోంది. ‘మడి కట్టుకోనివాడికి భోజనం మండువాలోనే’ అన్న ఆచారాన్ని తిరగరాస్తూ- అది వెలి కాదు, శౌచంలో అదొక భాగమని గుర్తు చేస్తోంది.
14 రోజుల ఏకాంతవాసమే శిక్ష..
పరిశుభ్రత పాటించనివారికి 14 రోజుల ఏకాంతవాసాన్ని శిక్షగా విధిస్తోంది. ఎంగిలి తిండికి ఎగబడ్డాడని ఏకంగా ఆరాధ్య దైవాన్నే అధిక్షేపించాడు ధూర్జటి. ‘నీకున్ మాంసము వాంఛయేని కరవా?’ అంటూ ఆరంభించి ‘నీ చేతిలో లేడి, ఓ గొడ్డలి ఉన్నాయి... నుదుటిమీద నిప్పు నెత్తిమీద నీరు తినడానికి కపాలం అందుబాటులో ఉన్నా, ‘ఆ బోయచే చేకొంటి ఎంగిలి మాంసము! ఇట్లు తగునా, శ్రీకాళహస్తీశ్వరా’ అని నిలదీశాడు. అది నింద కాదు- ఆచార నిరాకరణ పట్ల ఆందోళన. ఆచారాలను తిరస్కరించడం అనారోగ్యానికి మూలకారణమన్నది ఆ భక్తుడి మనోవేదన. అది లోకానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ‘కరచాలనాలు ఆలింగనాలు అయ్యో వద్దే వద్దు... నవ్వులు రువ్వుతు నమస్కరించడమే మాకెంతో ముద్దు’ అంటూ కొత్త పల్లవి అందుకొంటోంది. ఈ స్థితిలో మనం పెంచుకోవాల్సింది- భయాన్ని కాదు, శౌచాన్ని. పంచుకోవాల్సింది- అపోహల్ని కాదు, అవగాహనను. స్వీయ నియంత్రణే మనకు అన్ని వేళలా శ్రీరామరక్ష!
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? దాని అవసరం ఏంటి?