సిద్ధాంతాల కోసమే తప్ప పదవుల కోసం తాను వెంపర్లాడడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అనంతరం రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు. రాజస్థాన్‌లో రాజకీయ కల్లోలం చెలరేగిన నెల రోజుల తర్వాత తొలిసారి మీడియా ముందుకు సోమవారం వచ్చారు పైలట్. సంస్థాగతమైన అంశాల్లో మాత్రమే తాను, తన పక్షం ఎమ్మెల్యేలు గొంతెత్తినట్లు చెప్పారు.
రాజస్థాన్‌లో పాలన సాగుతున్న తీరుపై కూడా తాము అసంతృప్తిగా ఉన్నామని ఇవన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రాతో చర్చల అనంతరం పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలే తమకు పరమావధి అని ఎమ్మెల్యేలు వారితో చెప్పినట్లు పైలట్ తెలిపారు. తాను ఏ పదవులనీ ఆశించి ఏదీ చేయలేదని, కాంగ్రెస్సే తనకు పదవులు కట్టబెట్టిందన్నారు. అవి తిరిగి తీసుకునే అధికారం కూడా పార్టీకి ఉందని ఆయన అన్నారు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడిన వారిని గుర్తించి గౌరవించాలన్నదే తన డిమాండ్‌గా పైలట్ స్పష్టం చేశారు. తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల విషయంలో తాను అంత దిగజారి మాట్లాడలేనన్నారు.
తను చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు పైలట్
ఐక్యంగా ఉంటారు..
కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంటుందని పరస్పరం గౌరవించుకుంటూ పార్టీ నేతలు ముందుకు సాగుతారని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. అశోక్ గహ్లోత్లో కలిసి పైలట్ పని చేస్తారని చెప్పారు.