కరోనా సంక్షోభంతో నిలిచిన ప్రగతి రథాన్ని తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో చారిత్రక అడుగు వేసింది మోదీ సర్కార్. ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పేరిట ఏకంగా రూ.20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.
జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ... ఆర్థిక ప్యాకేజీ వివరాల్ని స్థూలంగా వెల్లడించారు. కరోనాపై పోరు కోసం ఇప్పటికే ప్రకటించిన గ్రాంట్లు, ఆర్బీఐ నిర్ణయాలు, ఇతర ఉద్దీపనలన్నీ కలుపుకుని ప్యాకేజీ విలువ రూ.20లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఇది భారత జీడీపీలో 10శాతమని వివరించారు. ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి రంగాలవారీగా ప్రకటిస్తారని చెప్పారు మోదీ.
భూమి, కార్మిక చట్టాలు, ద్రవ్య లభ్యత, చట్టాలు... ఇలా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని రూపొందించినట్లు వివరించారు మోదీ. పేదలు మొదలు పరిశ్రమల వరకు.. ప్రతి వర్గానికి అండగా నిలిచేలా ఈ ప్యాకేజీ ఉంటుందని తెలిపారు.
సంస్కరణల పథం
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సాహసోపేత సంస్కరణలతో ముందుకు సాగడం అనివార్యమన్నారు మోదీ. గత ఆరేళ్లలో చేపట్టిన సంస్కరణల కారణంగానే ఈ సంక్లిష్ట సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ సుదృఢంగా ఉందని చెప్పారు.