చిన్నప్పుడు చదువుకున్న కాకి కథ మనందరికీ తెలుసు. తన దాహం తీర్చుకోవడానికి కుండ అడుగున ఉన్న నీళ్ల కోసం గులక రాళ్లను వేస్తుంది కాకి. అదే మాదిరిగా ఓ గుంతలో చిక్కుకున్న ఏనుగు పిల్లను కొందరు స్థానికుల సాయంతో ఒడ్డుకు చేర్చారు అటవీ అధికారులు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని అట్టప్పడిలో జరిగింది.
ఇలా ఒడ్డుకు చేరింది!
ఏడాదిన్నర వయస్సున్న ఏనుగు పిల్ల దారితప్పి ఓ నీటి గుంతలో పడింది. ఒడ్డుకు చేరేందుకు నానా తంటాలు పడింది. అయితే ఫలితం లేకపోయింది. దీనిని గమనించిన స్థానికులు... అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, స్థానికులు కలిసి తాడుతో బుజ్జి గజేంద్రుడిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం శూన్యమే.
అప్పుడు కాకి కథ గుర్తొచ్చి... అటవీ అధికారులు, స్థానికులు కలిసి ఆ గుంతను కొంతవరకు రాళ్లతో నింపారు. దీంతో కొంతమేర పైకి వచ్చిన ఏనుగు... పూర్తిగా ఒడ్డుకు చేరుకొని అడవిలోకి పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఇదీ చూడండి: పుష్కరం తర్వాత ఆ మొక్క మళ్లీ పూసింది