నూతనంగా తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను కేంద్రం పరువుప్రతిష్ఠల సమస్యగా భావించకుండా ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న ఆయన.. సాగు చట్టాల ఉపసంహరణపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేయాలని సూచించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు.
గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనను ఆజాద్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనను ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు. జాతీయ జెండాను అగౌరవపరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. అయితే, ఈ దుశ్చర్యతో సంబంధం లేని ప్రజలు రైతు నేతల్ని మాత్రం శిక్షించొద్దన్నారు. లేదంటే అది మరో ఉద్యమానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులను అన్నదాతలుగా అభివర్ణించిన ఆజాద్.. కేంద్రం వారిని ఎదుర్కోవడం మానేసి ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కీలక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
వారు జాతి వ్యతిరేకులు కాదు
పలువురు మీడియా వ్యక్తులు, కాంగ్రెస్ నేత శశిథరూర్ వంటి వ్యక్తులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆజాద్. వారిని జాతివ్యతిరేకులుగా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు. శశి థరూర్ విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి అని గుర్తు చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహించిన జాతి వ్యతిరేకి అయితే మనమంతా ఆ కోవలోకే వస్తామని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఆజాద్.. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మా గాంధీ చేసిన ఖేడా సత్యాగ్రహం, నీలిమందు రైతుల ఉద్యమాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే జనవరి 26న జరిగిన ఘటన తర్వాత అదృశ్యమైన యువ రైతుల ఆచూకీ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. చైనాతో తలెత్తిన ఉద్రిక్తతల విషయంలో యావత్ భారత్ ప్రధాని మోదీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలిపారు.
కశ్మీర్‌కు రాష్ట్ర హోదా
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా తిరిగి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు ఆజాద్. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కశ్మీర్ ప్రజలు సంతోషంగా లేరని, అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయని చెప్పారు.
15 గంటల పాటు చర్చ..
సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను మరో ఐదు గంటలు పొడిగించారు.
వాయిదాతో మొదలు
అంతకు ముందు రాజ్యసభ ఉదయం 9గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నూతన సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం 9:40గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. ఆ తర్వాత నిర్విరామంగా సాగింది.