సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆరోగ్య సంక్షోభాలతో పాటు పర్యావరణ సమస్యలను ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్నాయన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో.. మానవత్వం మీద విశ్వాసాన్ని కోల్పోవద్దన్న 'మహాత్ముడి' ఆదర్శాలను పాటించాలని చెప్పారు. గత వారం కొవిడ్ సోకడం వల్ల స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ నిర్వహించిన సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. వీడియో రూపంలో ఈ సందేశాన్ని అందించారు.
'సానుభూతి కాదు..'
కొవిడ్ మహమ్మారితో ప్రపంచమంతా అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఉప రాష్ట్రపతి తెలిపారు. 1918లో స్పానిష్ ఫ్లూపై పోరులో గాంధీ చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలన్నారు. పేదల బాధను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
"స్పానిష్ ఫ్లూ సమయంలో గాంధీ చెప్పిన మాటలను ఈ కరోనా కాలంలో మనం అన్వయించుకోవాలి. ఆ రోజుల్లో మహమ్మారిని తరమడానికి అందరూ నిబంధనలను పాటించాలని మహాత్ముడు పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందించాలని కోరారు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ వాటిని మనం పాటించాలి."
- వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి
ఇదీ చూడండి: 'ఆత్మనిర్భర్ భారత్లో ప్రపంచ సంక్షేమమూ భాగమే'