దేశంలో కరోనా మహ్మమారి విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఫలితంగా కొవిడ్-19 నుంచి కోలుకుంటున్నవారి శాతం గణనీయంగా పెరిగింది. శనివారం నాటికి కరోనా రోగుల సంఖ్య కంటే వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,06,661 ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 3,09,712 మందికి నయమైంది.
"రికవరీ రేటు 58.56 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 2,03,051 మంది వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కరోనా నివారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా కేంద్రం తీసుకున్న సమర్థమైన చర్యల వల్లే ఇది సాధ్యమైంది."
-కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఇవే!
- దేశవ్యాప్తంగా ప్రభుత్వ(749), ప్రైవేటు(287) రంగంలో మొత్తం 1,036 కొవిడ్-19 పరీక్ష ల్యాబ్‌లు ఏర్పాటు.
- రోజూ 2లక్షలకు పైగా నమూనా పరీక్షలు. ఇప్పటివరకు 82,27,802 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షల నిర్వహణ.
- కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా 1,77,529 ఐసోలేషన్ బెడ్స్, 23,168 ఐసీయూ, 78,060 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్‌తో 1,055 ఆస్పత్రుల కేటాయింపు.
- 1,40,099 ఐసోలేషన్ బెడ్స్, 11,508 ఐసీయూ, 51,371 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్‌తో 2,400 కొవిడ్-19 ఆరోగ్య కేంద్రాలు.
- వైరస్‌ను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా 8,34,128 బెడ్స్‌తో 9,519 కరోనా సంరక్షణ కేంద్రాల ఏర్పాటు.
- రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 187.43 లక్షల ఎన్95 మాస్క్‌లు పంపిణీ, 116.99 లక్షల వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు(పీపీఈ కిట్లు) అందజేత.
ఇదీ చూడండి: సీబీఐ చేతికి తండ్రి, కొడుకుల లాకప్‌డెత్ కేసు