ఒడిశాలోని పూరి పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవం ప్రారంభమైంది. సాధారణంగా సుమారు పది లక్షల భక్తులు పాల్గొనే ఈ ఉత్సవంపై కరోనా వైరస్ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య... స్వామి సేవలో ఉండే 'సేవాయత్'లే జగన్నాథ, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబైన రథాలపై ప్రతిష్టించారు.
భక్తులు పాల్గొనకుండా ఏడు రోజుల పాటు మాత్రమే రథయాత్ర నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. చరిత్రలోనే తొలిసారిగా నేటి యాత్రలో కేవలం పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. అంతేకాకుండా ఒక్కో రథం లాగేందుకు ఐదువందల మంది చొప్పున మూడు రథాలకు కలిపి కేవలం 1500 మందిని మాత్రమే సుప్రీం అనుమతినిచ్చింది. అయితే, భక్తులు వీక్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.
సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు పూరి నగరంలో పూర్తి మూసివేత ఉత్తర్వులు అమలులో ఉంటాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగంణంలో శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టారు.
ప్రధాని శుభాకాంక్షలు...
ప్రధాని నరేంద్ర మోదీ భక్తులకు రథయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవం దేశ ప్రజల జీవితాల్లో సంతోషం, సంపద, అదృష్టం, ఆరోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:'నావిగేషన్'లో చైనా కీలక విజయం