అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఖర్చు రూ.1100కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్. ప్రధాన దేవాలయ నిర్మాణానికి మూడు నుంచి మూడున్నరేళ్లు పడుతుందనీ, రూ. 300-400కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మొత్తం 70 ఎకరాలను అభివృద్ధి చేయటానికి వ్యయం రూ.1100 కోట్లు దాటుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ రంగ నిపుణులతో చర్చించాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కానీ, ఆలయ నిర్మాణ వ్యయంపై ట్రస్ట్ అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించలేదన్నారు. దేశవ్యాప్తంగా 6.5 లక్షల గ్రామాల్లోని 15 కోట్లు కుటుంబాల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించటమే తమ లక్ష్యమని చెప్పారు.
"కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు, కుటుంబాలు మా వద్దకు వచ్చి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తామని, తగినంత విరాళాలు అందిస్తామని చెప్పారు. కానీ నేను సున్నితంగా తిరస్కరించా. విరాళాల సేకరణ ముసుగులో భాజపా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు ఎలా ఆలోచిస్తే వారికి అలానే కనబడుతుంది. కానీ మా దృష్టి భక్తి పైనే ఉంది."
-గోవింద్ దేవ్ గిరి మహారాజ్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి
విరాళాల కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి వెళ్తారా? అన్న ప్రశ్నకు.. అతను విరాళం.. ఇస్తానంటే తను వెళ్లేందుకు సిద్ధమన్నారు. శివసేన నాయకులు, మహారాష్ట్ర ఎమ్ఎల్సీ డిప్యూటీ ఛైర్పర్సన్ నీలమ్ గోర్హె.. కేజీ వెండి ఇటుకలను విరాళంగా ఇచ్చారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ ఇంటికి వెళ్తారా? అన్న ప్రశ్నకు.. తనను అక్కడ అగౌరవించరని ఎవరైనా హామీ ఇస్తే తప్పక వెళ్తానని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : అయోధ్య గుడికి విరాళంగా జీవితకాల సంపాదన