సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన చక్కా జామ్‌ను ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో నిర్వహించకూడదన్న బీకేయూ నేత రాకేశ్ టికాయత్ నిర్ణయాన్ని.. సీనియర్ రైతు నేత దర్శన్ పాల్ తప్పుబట్టారు. టికాయత్ నిర్ణయాన్ని ఓ తొందరపాటు చర్యగా అభివర్ణించారు. సంయుక్త కిసాన్ మోర్చాతో.. టికాయత్ తొలుత పంచుకున్న ప్రణాళికను అమలు చేసి ఉంటే బాగుండేదని అని పేర్కొన్నారు.
"యూపీ, ఉత్తరాఖండ్‌లో చక్కా జామ్ ఉండకూడదని టికాయత్ నిర్ణయించారు. ఇది అనూహ్యమైనది. మీడియాకు చెప్పకముందు.. మాతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని ఉండేది. నిర్ణయం తీసుకున్న తర్వాత సంయుక్త కిసాన్ మోర్చాతో చర్చించారు. తొందరపడి ముందుగానే మీడియాకు చెప్పేశారు. ఇలా జరిగిందని.. మా మధ్య విభేదాలు ఉన్నట్టు అనుకోవడం మాత్రం సరైనది కాదు."
--- దర్శన్ పాల్, సీనియర్ రైతు నేత.
6వ తేదీన దేశవ్యాప్తంగా చక్క జామ్ నిర్వహిస్తామని సంయక్త కిసాన్ మోర్చా గత వారం ప్రకటించింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఈ కార్యక్రమం ఉండబోదని శుక్రవారం టికాయత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టికాయత్ది తొందరపాటు చర్య అని దర్శన్ పేర్కొన్నారు.
అయితే.. దేశవ్యాప్తంగా చక్కా జామ్ విజయవంతంగా ముగిసిందని సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో.. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ పేర్లు ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి: మరో 7 కొవిడ్ టీకాలు సిద్ధమవుతున్నాయి: కేంద్రం