ఉన్నావ్ బాధితురాలికి నిందితులు నిప్పు పెట్టిన ఘటనపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని కాంగ్రెస్, సీపీఎం సహా ఇతర పార్టీల నేతలు పట్టుబట్టారు.
ఉన్నావ్ ఘటనను తీవ్రంగా ఖండించారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. విషయం తెలియగానే ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శితో మాట్లాడానని, నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తనకు చెప్పారని వివరించారు ఉపరాష్ట్రపతి. ప్రస్తుతం రాజ్యసభలో ఈ అంశంపై చర్చించడం కుదరదని స్పష్టంచేశారు.
"ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నాన్ని రాజ్యసభ ఖండిస్తోంది. కేవలం ఒక్క కేసులో నిందితులను అరెస్టు చేస్తే సరిపోదు. సభ్యులందరూ చెప్పిన విధంగానే.. ఇలాంటి ఘటనలపై వెంటనే, వేగంగా, కఠిన చర్యలు తీసుకుంటామన్న సంకేతాన్ని దేశానికి, సమాజం మొత్తానికి పంపాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మరోమారు జరగకుండా ఉంటాయి."
- వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్
మార్చిలో బాధితురాలు తన తల్లిదండ్రులను కలిసి తిరిగి వెళ్తున్నక్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆమెను అత్యాచారం చేశారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పట్లోనే నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో విచారణ నిమిత్తం బాధితురాలు కోర్టుకు వెళ్తున్న క్రమంలో ఐదుగురు వ్యక్తులు.. ఇవాళ తెల్లవారుజామున ఊరి చివర ఆమెకు నిప్పు పెట్టి పరారయ్యారు. బాధితురాలి శరీరం 90 శాతం మేర కాలిపోయినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌చేశారు. నిందితుల్లో ఒకరు మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.