కరోనా కాలంలో మద్యం అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఒకవేళ మద్యం దుకాణాలు తెరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామన్న ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నారు.
ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచిస్తూ ట్వీట్ చేశారు రజనీకాంత్.
సుప్రీంకోర్టుకు వ్యవహారం...
తమిళనాడులో లిక్కర్ షాపులను మూసివేయాలని 2 రోజుల క్రితమే మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్టే విధించాలంటూ పళని సర్కారు శనివారం.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకం, హోం డెలివరీ చేయడం సాధ్యం కాదని పిటిషన్‌లో పేర్కొంది.
మరుసటి రోజే రజనీ పైవ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే తమిళనాడు సర్కారు మద్యం అమ్మకాలకు అనుమతివ్వడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయాన్ని విపక్ష డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది.