బిహార్‌లో వరద ప్రభావానికి గురైన 15 జిల్లాల్లో మృతుల సంఖ్య 97కి చేరింది. గడిచిన 24 గంటల్లో 24 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రవహించే పన్పన్, గంగా నదుల్లో వరద ఉద్ధృతి తగ్గినట్లు వెల్లడించారు.
వరుణుడు శాంతించినా బిహార్ ప్రజలకు ఇక్కట్లు తప్పట్లేదు. రాజధాని పట్నా సహా పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలన్నీ వరద ముంపులోనే ఉన్నాయి. వరద నీరు డ్రైనేజీ నీటితో కలిసిపోవడం వల్ల ఎక్కడికక్కడ దుర్గంధం వెలువడుతోంది.
ప్రజల ఇక్కట్లు- ప్రభుత్వంపై అసహనం
పట్నా రాజేంద్రనగర్‌లోని ప్రజలు మురికి నీటిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు.
"నా ఇల్లు ఇంకా ముంపులోనే ఉంది. ఇంట్లోని సామగ్రి మొత్తం నీట మునిగి నాశనమైంది. మా కుటుంబం అంతా వారం రోజులుగా ఈ కష్టాలను అనుభవిస్తున్నాం. పట్నా పురపాలక సంస్థ ఏం చేస్తోంది. మేం ఇలాగే జీవించాలా ?"
-ఆర్తి దేవీ, రాజేంద్రనగర్ వాసి
"పరిస్థితులను చక్కదిద్దడం కాకుండా ప్రభుత్వ విపక్షాలన్నీ ఒకరినొకరు విమర్శించుకోవడానికే ఉన్నాయి. వాలంటీర్లు మాత్రం అసలైన సేవ చేస్తున్నారు. పట్నా నగర డ్రైనేజీ వ్యవస్థ మ్యాప్‌లు గల్లంతైనట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. వారు పట్నాను స్మార్ట్ సిటీగా మార్చాలనుకుంటున్నారు. ముందు నగరాన్ని ప్రజలు జీవించడానికి అనువుగా మార్చితే చాలు."
-మాయాదేవి, రాజేంద్రనగర్ వాసి
అన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టైఫాయిడ్, కలరా, మలేరియా, డెంగీ వంటి రోగాల కేసులు అధికంగా నమోదవుతున్నట్లు చెబుతున్నారు.
"రాజధానిలో వరదలు ప్రభుత్వ నిస్సహాయతను వేలెత్తి చూపిస్తున్నాయి. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వాలు జాగ్రత్త వహించకుంటే మాత్రం అంతకంటే పెద్ద తప్పిదమవుతుంది. ఇన్ఫెక్షన్లు సోకకుండా మందులు చల్లడం, స్వచ్ఛమైన నీరు అందించడం, వ్యర్థాలను సరైన ప్రాంతంలో వేయడం వంటివి చేపట్టాలి."
-కేశవ్ కుమార్, వైద్యుడు
ప్రభుత్వ చర్యలు
అనేక రోజులుగా ముంపులోనే ఉన్న రాజేంద్రనగర్‌లో శక్తిమంతమైన పంప్‌ల సాయంతో నీటిని తొలిగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పట్నా బోధనాసుపత్రి, నలందా బోధనాసుపత్రులలో అక్టోబర్10, 11, 12 తేదీల్లో ఉచితంగా డెంగీ నిర్ధరణ పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపాయి.