భారత భూభాగాలను చైనా దురాక్రమణ చేస్తుంటే, ప్రధాని ఏమీ పట్టనట్లు ప్రవర్తించారని రాహల్ విమర్శంచారు. గుజరాత్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమైన మోదీ.. ప్రాదేశిక సమగ్రత సమస్యపై కనీసం ఒక్క మాట కూడా అడగలేదని దుయ్యబట్టారు. మోదీ తన చైనా పర్యటనలో సైతం డోక్లాం దురాక్రమణ గురించి కనీసం ప్రస్తావించలేదని రాహుల్ ఆరోపించారు.
2017 జూన్‌లో చైనా సైన్యం డోక్లాంలో రోడ్డు నిర్మాణపనుల కోసం హద్దుమీరింది. దీనిని భారత సైన్యం అడ్డుకుంది. భూటాన్‌తో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో డోక్లాంను చైనా అక్రమించకుండా భారత్ నిలువరించింది.
జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌పై చర్యల విషయంలో సైతం మోదీ విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు. ఈ విషయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను చూసి మోదీ భయపడ్డారని ఎద్దేవా చేశారు. మోదీ ఒక బలహీనమైన ప్రధాని అని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అరుణాచల్ ప్రదేశ్ సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు తిరిగి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. భాజపా తనను ప్రశ్నించే వారిని అణచివేస్తోందన్నారు. రాజ్యసభలో పౌరసత్వ బిల్లు ఆమోదాన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు.