భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పౌరసత్వంపై రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ ప్రజలను తప్పుదోవపట్టించి అల్లర్లు రేకెత్తిస్తున్నారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం కారణంగా మైనార్టీలెవరూ పౌరసత్వం కోల్పోరని అమిత్ షా హామీ ఇచ్చారు. కేవలం మూడు పొరుగుదేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొని దేశానికి వలస వచ్చిన వారికే పౌరసత్వం ఇవ్వడమే చట్టం ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరినుంచి పౌరసత్వం తొలగించేది లేదని ఉద్ఘాటించారు.
"రాహుల్, ప్రియాంక వాద్రాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కార్యకర్తలందరినీ అడుగుతున్నా... పక్క దేశాలనుంచి వస్తున్న పేద శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలా? వద్దా? డెబ్బై ఏళ్లుగా మహాత్మాగాంధీ హామీని వారు నెరవేర్చలేకపోయారు. నరేంద్ర మోదీ నెరవేర్చారు. సీఏఏ వల్ల ఏ దేశానికి చెందిన మైనార్టీలకైనా పౌరసత్వం తొలగించే సమస్యే లేదని మైనారిటీ సోదరులందరికీ చెప్పదలచుకున్నా. ఎందుకంటే సీఏఏలో పౌరసత్వం తొలగించడమనే అంశమే లేదు."
-అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు
మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు అమిత్ షా. వాగ్దానాలతో ప్రజలను తప్పదోవపట్టించి ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ప్రజలను ప్రతిసారీ తప్పుదోవ పట్టించలేరని అన్నారు. దిల్లీలో రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.