సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. నేడు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంగ్లంలో ప్రమాణం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ సమయంలో యూపీఏ కూటమి నేతలంతా చప్పట్లతో రాహుల్‌ను అభినందించారు. ప్రమాణం పూర్తయిన తర్వాత.. సంతకం చేయకుండా వెనుదిరుగుతోన్న రాహుల్‌ను అక్కడి సిబ్బంది పిలవగా.. నవ్వుతూ వెనక్కి వచ్చి పని పూర్తి చేశారు. అనంతరం సభ్యులందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్లి.. తన స్థానంలో కూర్చున్నారు.
2019 సార్వత్రికంలో వయనాడ్‌తో పాటు.. ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీ నుంచి బరిలోకి దిగారు రాహుల్. వయనాడ్‌లో గెలిచి.. అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు.
ప్రమాణానికి కొన్ని నిమిషాల ముందు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. నాలుగోసారి పార్లమెంటు సభ్యునిగా ప్రమాణం చేయబోతున్నాను అని ట్వీటారు.
''కేరళలోని వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. పార్లమెంటులో కొత్త ప్రయాణాన్ని ఆరంభించబోతున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత, విశ్వాసంతో ఉంటాను.''
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ