కాంగ్రెస్ పార్టీకి నూతన సారథి విషయంపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ సమావేశమైంది. 23 మంది సీనియర్లు రాసిన లేఖపై భేటీలో వాడీవేడిగా చర్చ జరిగింది. తనకు వచ్చిన లేఖను కేసీ వేణుగోపాల్‌కు ఇచ్చారు సోనియా గాంధీ. దానిని ఆయన అందరికీ చదివి వినిపించారు. రాజస్థాన్‌లో ఒకవైపు ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా, అదే సమయంలో సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండగా లేఖ రాయాల్సిన అవసరమేంటని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ లేఖపై సీడబ్ల్యూసీలోని మిగతా సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయం వెలిబుచ్చడానికి సమయం, సందర్భం చూసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు తనకు అవకాశమివ్వాలని పార్టీ నేతలను కోరారు సోనియా. నూతన అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు పదవిలో సోనియానే కొనసాగాలని సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోని విజ్ఞప్తి చేశారు.