కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. పదవి నుంచి వైదొలిగే విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాహుల్ సంకేతాలిస్తున్నారు. రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని కొంత మంది పార్టీ కార్యకర్తలు దిల్లీలోని రాహుల్ ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు రాహుల్ గాంధీ.
రాజీనామా విషయంలో పట్టువీడని రాహుల్ పార్టీ నేతలతోనూ భేటీ కావడంలేదు. మంగళవారం ఆయన తన తల్లి, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, పార్టీ నేతలు కే.సి.వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా మినహా ఎవరితోనూ సమావేశం కాలేదు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ రాహుల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే వారితో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇష్టపడకపోయినందున వారు ప్రియాంకతో సమావేశమయ్యారు.
ఇదీ చూడండి : లైవ్ వీడియో: విష సర్పంతో కుక్కల ఫైట్