కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దుబాయి నుంచి వస్తోన్న ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్‌లోని విమానాశ్రయంలో రన్‌వేపై అదుపుతప్పి రెండుముక్కలయింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తీవ్ర బాధ కలిగించింది: మోదీ
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
" విమాన ప్రమాదం తీవ్ర బాధ కలిగించింది. ప్రాణాలు కోల్పోయిన వారి గురించే నా ఆలోచనలు. గాయపడిన వారు త్వరితగతంగా కోలుకోవాలి. సంబంధిత అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడాను."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రాష్ట్రపతి దిగ్భ్రాంతి..
విమాన ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌తో మాట్లాడి.. విచారణ చేపట్టాలని కోరినట్లు చెప్పారు. ప్రమాదానికి గురైన ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాలు గురించి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
షా విచారం..
విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించినట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ..
విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా సహా ఇతర నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాదంలో 16కు చేరిన మృతులు