ఎన్నికల సంస్కరణల కోసం తాను దాఖలుచేసిన 11 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై త్వరగా విచారణ జరిపించాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బోబ్డేకి లేఖ రాశారు భాజపా నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్. ఎన్నికల సంస్కరణలతోనే జాడ్యాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుంది కాబట్టి తక్షణం తాను దాఖలుచేసిన కేసులపై భౌతిక విచారణ మొదలు పెట్టేలా ఆదేశించాలని కోరారు.
"పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం డబ్బే కాకుండా కండబలం, కులం, మతం, భాష, ప్రాంతాల పేర్లను బహిరంగంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ వైఫల్యానికి మూల కారణం రాజకీయనాయకులు-నేరగాళ్లు-ప్రభుత్వ ఉద్యోగులు కుమ్మక్కు కావడమే. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరివల్ల చట్టాలను తుంగలో తొక్కే వారే శాసనకర్తలుగా మారారు. అందులో కొందరు పద్మ అవార్డులు కూడా చేజిక్కించుకున్నారు. అక్రమ ధనార్జనకు రియల్ ఎస్టేటు ప్రధాన వనరుగా మారుతోంది. భూములు, భవనాలు బలవంతంగా కబ్జాచేయడం, ఇప్పటికే ఉన్న యజమానులు, కిరాయిదారులను బెదిరించి బయటికి గెంటేసి తక్కువ ధరకు ఆస్తులను చేజిక్కించుకోవడంవంటి చర్యల ద్వారా నేరగాళ్లు దండిగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నేర న్యాయవ్యవస్థ (క్రిమినల్ జస్టిస్ సిస్టం) వ్యక్తిగత నేరాలను విచారించడానికి పనికొస్తుందే తప్ప ఇలాంటి మాఫియా కార్యకలాపాలను నిలువరించే పరిస్థితిలో లేదు. పైగా ఆర్థిక నేరాలకు సంబంధించి చట్టాల్లో ఉన్న నిబంధనలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి రుగ్మతలను అరికట్టాలన్న ఉద్దేశంతో బాధ్యతగల పౌరుడిగా ఎన్నికల సంస్కరణల కోసం 11 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాను. ఇందులో వాదనలు పూర్తయి తుది విచారణ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం కొవిడ్ కారణంగా ఈ కేసులు విచారణ జాబితాలోకి రావడంలేదు. అందువల్ల సామాజిక అత్యవసరతను దృష్టిలో ఉంచుకొని ఈ కేసుల వరకు భౌతిక విచారణ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తిచేయాలి" అని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఇకపై మరింత పెద్దగా పొగాకు హెచ్చరికల చిత్రాలు