సైన్యానికి ఉన్న గౌరవం, జాతీయ పతాకానికి ఉన్న ఔన్నత్యం గురించి భాజపా నేతలకు తెలుసా? అని కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మండిపడ్డారు. ఎర్రకోట వద్ద జాతీయ పతాకం పట్ల అనుచితంగా ప్రవర్తించిన రైతులను సమర్థించడం ద్వారా అమరీందర్ సింగ్.. సైన్యాన్ని, త్రివర్ణ పతాకాన్ని అవమానించారంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ శుక్రవారం చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
"జాతీయ పతాకాలు చుట్టిన సోదరుల, కన్నబిడ్డల దేహాలు రెండు రోజులకొకటి చొప్పున ఇళ్లకు చేరుతుంటే పంజాబ్ ప్రజలు అనుభవించే బాధ ఎలాంటిదో మాకు తెలుసు. భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సైనికులు చేస్తోన్న ప్రాణత్యాగాల పట్ల భాజపాకు ఏ మాత్రం సానుభూతి లేదు. తమ తల్లి తండ్రులు, సోదరులు హక్కుల కోసం పోరాడుతూ లాఠీ దెబ్బలు తింటుంటే, బాష్పవాయు గోళాల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతుంటే దేశ రక్షణలో నిమగ్నమైన సైనికులకు కలిగే బాధ, ఆవేదనలను తరుణ్ చుగ్ కానీ, అతని పార్టీ కానీ అర్థం చేసుకోలేకపోతున్నాయి."
-- అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి
రాజ్యాగం స్ఫూర్తిని అడుగడుగునా ధ్వంసం చేస్తోన్న భాజపా నేతలు గణతంత్ర దినోత్సవ ఔన్నత్యం గురించి మాట్లాడే హక్కును, నైతికతను కోల్పోయారని అమరీందర్ సింగ్ దుయ్యబట్టారు. దేశానికి ఆహార భద్రతను సమకూర్చే పేద రైతులు తీవ్ర చలిలో ప్రాణాలు విడుస్తుంటే భాజపా నేతల ఔచిత్యం ఏమైందని నిలదీశారు.
ఇదీ చదవండి:అన్నదాతల ఆందోళనలో ఏకమైన జాట్‌లు