ప్రపంచవ్యాప్తంగా మతపరమైన మైనారిటీల పరిస్థితిపై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలీజా రైస్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం(యూస్ఐఎస్పీఎఫ్) రెండో వార్షిక సదస్సులో పాల్గొన్న ఆమె.. ఇదో తీవ్రమైన సమస్యగా తయారైందని వ్యాఖ్యానించారు.
"ప్రపంచవ్యాప్తంగా మతపరమైన మైనారిటీల రక్షణ సమస్యగా మారింది. ఇదే మార్గంలో నడిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ప్రతీ నాయకుడు గుర్తించాలి."
-కండోలీజా రైస్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి
మతం నుంచి జాతీయ విధానాలను వేరు చేయాలని రైస్ సూచించారు. సమాజంలో నిత్యం ఎన్నో సమస్యలు తయారవుతున్నాయనీ.. మతం వెనక పరుగెడితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంతో పరిష్కారం
సంప్రదాయ జాతీయవాదం, వాక్పటిమతో ఎందరో నాయకులు అధికారం పొందారని పరోక్షంగా రష్యా, చైనాలను ఉద్దేశించి రైస్ విమర్శించారు. అంతటా స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం విలసిల్లాలని ఆమె ఆకాంక్షించారు.
"ప్రజాస్వామ్యంలో గొప్ప విషయమేమిటంటే.. ప్రజా గళంతో ప్రభుత్వాలు, విధానాలు రూపొందుతాయి. కానీ అధికార వాద రాజ్యాల్లో ఏ విషయంపై అయినా తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాంటి సమయాల్లో దూరదృష్టి లేకుండా తప్పుడు విధానాలనూ అమలు పరిచే ఆస్కారం ఉంటుంది."
-కండోలీజా రైస్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి
భారత్-అమెరికా సంబంధాలపై..
జార్జ్ బుష్ ప్రభుత్వంలో 2005-09 మధ్య విదేశాంగ శాఖ మంత్రిగా రైస్ పనిచేసిన కాలంలోనే చారిత్రక భారత్-అమెరికా అణు ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో అమెరికా, రష్యా మధ్య ప్రస్తుత సంబంధాలు, భారత్తో పాటు అంతర్జాతీయ సంబంధాలపై వాటి ప్రభావాలపై సుదీర్ఘంగా మాట్లాడారు రైస్.
హ్యూస్టన్ సభలో అమెరికా-భారత్ దేశాధినేతలు ఒక్కతాటిపైకి వచ్చినా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో సందిగ్ధ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ అంశంపైనా రైస్ స్పందించారు. ఇరు దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవటంలో నేతలు విఫలమయ్యారని పేర్కొన్నారు.
ఆర్థిక విభేదాల పరిష్కారంతో..
ఈ ఏడాది జూన్లో భారత్కు ప్రాధాన్యాల సాధారణ వ్యవస్థ(జీఎస్పీ) హోదాను రద్దు చేసింది అమెరికా. భారత్ కూడా 28 అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది.
"సాంకేతిక పరిజ్ఞానం, చమురు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాయి. భౌగోళిక రాజకీయ దృక్పథం, ప్రపంచ పరిణామ క్రమాన్ని మార్చే శక్తి వీటికి ఉంది."
-కండోలీజా రైస్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి
భారత్, అమెరికా ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి రెండు దేశాలు ఇంకా ఎంతో చేయాల్సి ఉందని రైస్ అభిప్రాయపడ్డారు. వాణిజ్య ప్రతినిధులు ఈ దిశగా ఒప్పందాలు చేసుకోవాలని ఆమె సూచించారు.
దిల్లీలో యూఎస్ఐఎస్పీఎఫ్ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ ముకేశ్ అఘి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మొత్తం 300 మంది ప్రైవేటు రంగ ప్రతినిధులు, ప్రపంచ సంస్థల సీఈఓలు, భారత్-అమెరికా ప్రభుత్వ నేతలు పాల్గొన్నారు.
భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్శంకర్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పరిశ్రమలు-రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. అమెరికా తరఫున మాజీ విదేశాంగ మంత్రి డాక్టర్ హెన్రీ కిస్సింజర్, మాజీ దౌత్యవేత్తలు టిమోతీ రోయ్మర్, రిచర్డ్ వర్మ పాల్గొన్నారు.
(రచయిత-స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు)