దిల్లీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ.... పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ సారి రాజ్యసభకు సీనియర్లను కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను పంపించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకతో పాటు మరికొందరు యువనేతలను రాజ్యసభకు పంపించాలని... కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దిగువసభలో రాహుల్, ఎగువసభలో ప్రియాంక
రాజ్యసభలో అంబికా సోనీ, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ కాలపరిమితి మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ స్థానాలను ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్ నేతలతో భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. పెద్దల సభకు ప్రియాంకను పంపి, లోక్‌సభలో రాహుల్, రాజ్యసభలో ప్రియాంక ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.