దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు.
కొత్త విధానంలో విద్యను సరళతరంగా మార్చారు. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను చదువుకొనే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం భారంగా మారిన పాఠ్యాంశాలను తగ్గించి, విద్యార్థులు తమలో అంతర్గతంగా దాగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించుకొనే అవకాశం ఇవ్వబోతున్నారు. పాఠశాల విద్య పూర్తిచేసుకొని బయటికెళ్లేనాటికి కనీసం ఒక వృత్తి విద్యా నైపుణ్యమైనా విద్యార్థి సాధించేలా మార్పులు చేస్తున్నారు.
5 వరకు అమ్మభాషే..
అయిదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నిబంధన విధించారు. వీలైతే 8వ తరగతి వరకు కానీ, అంతకు మించిన తరగతుల వరకు కానీ మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ఉత్తమమని ఈ కొత్త విధానంలో రాష్ట్రాలకు నిర్దేశించారు.
ఇకమీదట మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా మార్చడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.