కేరళ కోజికోడ్‌లో విమానం అదుపుతప్పి లోయలో పడిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
"కేరళ కోజికోడ్ వద్ద జరిగిన విషాదకరమైన ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. కేరళ గవర్నర్‌తో మాట్లాడాను. పరిస్థితిని గురించి తెలుసుకున్నాను. బాధిత ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి."
-రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఉపరాష్ట్రపతి
ఈ విషాదకరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
"విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాద వివరాలను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను అడిగి తెలుసుకున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా."
-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రధాని
విమాన ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం పినరయి విజయన్‌తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు.
ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ సైతం విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
విమాన ప్రమాద వార్త విని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సైతం ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.
రాహుల్
విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంకా గాంధీ సహా ఇతర నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
అమెరికా-పాక్ సైతం
కేరళ దుర్ఘటనపై అమెరికా సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల దుఃఖాన్ని పంచుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ కార్యాలయం పేర్కొంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అభిలషించింది.
కేరళ విమాన ప్రమాదంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రన్ ఖాన్ సైతం విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు అండగా ఉండాలని ప్రార్థించారు.