దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. పెండింగ్‌లో ఉన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతికి చెందిన 29 కీలక సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. అవకాశం రాగానే ప్రథమ ప్రాధాన్యంగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. పైతరగతులు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ 29 సబ్జెక్టుల పరీక్షలు కీలకమని పేర్కొంది. పరీక్షల నిర్వహణకు 10 రోజుల ముందే విద్యార్థులకు సమాచారం ఇస్తామని కేంద్ర మానవ వనరులశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
"ఇప్పటికే నిర్వహించిన సీబీఎస్‌ఈ పరీక్షల సమాధాన పత్రాలు దిద్దేప్రక్రియ మొదలు పెట్టాలని.. రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. నిన్న రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించిన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పరీక్షలపై వారి అభిప్రాయాలనుకోరారు. ఇంటర్నల్ పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సూచించారు. ప్రస్తుతపరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ‌్యంకాదని ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాల విద్యామంత్రులు తమ బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో గందరగోళం తలెత్తకుండా పరీక్షలనిర్వహణకు సిద్ధమవుతున్నాం."
- కేంద్ర మానవ వనరులశాఖ సీనియర్ అధికారి
సీబీఎస్‌ఈ బోర్డు కూడా పరీక్షల నిర్వహణపై గత నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ట్వీట్ చేసింది. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలను జూన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు వారం రోజుల్లో ప్రత్యామ్నాయ క్యాలండర్‌ను యూజీసీ వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.