మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వానలకు ముంబయి మహానగరం తడిసిముద్దయింది. నగరంలోని ప్రముఖ పర్యటక ప్రాంతం 'పోవై' సరస్సు పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో ఓవైపు లాక్డౌన్ ఆంక్షలు, మరోవైపు భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా సరస్సును చూసేందుకు పలువురు తరలివస్తున్నారు.
రెడ్ అలర్ట్‌ను కొనసాగిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్ర-గోవా తీరంలో ఈదురు గాలుతో కూడిన వాతావరణం ఉంటుందని.. గాలి వేగం గంటకు 50-60 కిలోమీటర్ల మేర ఉండొచ్చని అంచనా వేసింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
చెరువులను తలపిస్తున్న ప్రాంతాలు..
నగరంలోని బులభాయ్ దేశాయ్ మార్గ్, బిందు మాధవ్ జంక్షన్, వర్లీ నాకా, హిందూమాతా జంక్షన్, ధోబిఘాట్, పరేడ్ చిరాబజార్, పోలీస్ కమిషనర్ కార్యాలయం, సియాన్ రోడ్ నం.24, గాంధీ మార్కెట్, అంధేరి మలాద్ వంటి ప్రాంతాల్లో వరద నీరు నిలిచి జన జీవనం స్తంభించింది.
కుప్పకూలిన భవనం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఠాణె నగరంలోని తెల్లి గల్లీ ప్రాంతంలో ఓ పాత భవనం కుప్పకూలింది. నెల రోజుల క్రితమే భవనాన్ని ఖాళీ చేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఠాణేలో అత్యధికంగా 377 మిల్లీమీటర్లు, పాల్ఘడ్ జిల్లాలో 93.06 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
రంగంలోకి బలగాలు..
భారీ వర్షాలతో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, నౌకాదళం, తీర రక్షక దళం, ఇతర విపత్తు స్పందన దళాలను రంగంలోకి దించింది ముంబయి మహానగర పాలక సంస్థ.
ఇదీ చూడండి: ముంబయిలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం