ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఆలయం ఇవాళ తిరిగి తెరుచుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున భక్తులెవరూ హాజరుకాలేదు. పరిమిత సంఖ్యలో ఆలయ కమిటీ సభ్యులు, పాలనాధికారుల నడుమ.. ఉదయం 6.10 గంటలకు సాదాసీదాగా ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున తొలి పూజ చేశారు అర్చకులు. రుద్రాభిషేకం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధికారి పేర్కొన్నారు.
6 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నందున.. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. 10 క్వింటాళ్ల పువ్వులతో అలంకరించారు.
6 నెలలకోసారి..
హిమాలయాల్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను.. మంచు కారణంగా 6 నెలల పాటు మూసివేసి ఉంచుతారు. అప్పుడు భక్తులకు ప్రవేశం ఉండదు. ఏటా ఏప్రిల్-మే నెల మధ్యలో తిరిగి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.
ఏప్రిల్ 26న అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. బద్రీనాథ్ ఆలయాన్ని మే 15న తెరవనున్నారు.