జమ్ముకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. అదనపు బలగాల తరలింపుపై తీవ్ర విమర్శలు చేసింది.
బలగాల మోహరింపు ఎందుకు చేపడుతున్నారో స్పష్టతనివ్వాలని కోరారు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలా అదనపు బలగాలను మోహరించలేదన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ అమర్నాథ్ యాత్రను రద్దు చేయలేదని గుర్తు చేశారు.
"నిన్న హోంశాఖ జారీ చేసిన ఆదేశం ఆందోళన కలిగించేలా ఉంది. దేశ ప్రజలతో పాటు జమ్ముకశ్మీర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో వెయ్యికిపైగా ప్రదేశాల్లో సైన్యం ఉగ్రవాద డంపులను గుర్తించింది. చాలా ల్యాండ్మైన్లు దొరికాయి. కానీ మేము ఎప్పుడూ ఏ యాత్రికులను వెళ్లిపోవాలని చెప్పలేదు. ఎలాంటి యాత్రను రద్దు చేయలేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోని ప్రతి నాయకుడు కేంద్ర ప్రభుత్వం చర్యను ఖండిస్తున్నారు."
- గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత
రాజకీయ సాహసం చేయొద్దు: సీపీఐ
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సాహసం చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది సీపీఎం. అలా కాదని ముందడుగు వేస్తే దేశంలో భయంకర పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించింది. అమర్నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలిపేయటం వల్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన, ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది సీపీఎం. కశ్మీర్లో తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది.
కశ్మీర్ నేతలదీ అదే మాట...
కశ్మీర్‌లోని తాజా పరిస్థితులపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ కశ్మీర్'పై నిఘా వర్గాల సమాచారం ఇదే!