వైరస్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన మోదీ.. సార్క్ సభ్య దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్‌పై పోరాడటంలో భారత్ చేపట్టిన చర్యలను వివరించారు. పక్క దేశాల పౌరులను కూడా కరోనా ప్రభావిత దేశాల నుంచి ఖాళీ చేయడంలో భారత్ సహకరించినట్లు గుర్తు చేశారు.
"మన దేశాల్లో 150 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. సార్క్ దేశాల ప్రజల మధ్య సంబంధాలు చాలా పురాతనమైనవి. మన మధ్య లోతైన అనుసంధానం ఉంది. అందువల్ల మనం అందరం కలిసి పనిచేసి, విజయం సాధించాలి."-నరేంద్రమోదీ, భారత ప్రధానమంత్రి
కరోనాపై పోరాటానికి ప్రాంతీయ సహకారం కోసం సార్క్ దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రధాని మోదీకి మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సొలిహ్ ధన్యవాదాలు చెప్పారు. ఏ దేశం వైరస్‌ను ఒంటరిగా ఎదుర్కొలేదని పేర్కొన్నారు. భారత్ సహకారం లభించడం అదృష్టమని వ్యాఖ్యానించారు.