మధ్యప్రదేశ్ రేవాలో నిర్మించిన 750 మెగావాట్ల సౌర విద్యుత్ పార్క్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు ప్రధాని.
మూడు విభాగాలుగా నిర్మించిన ఈ సోలార్ పార్క్‌లో ఒక్కో దాంట్లో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టు ఏడాదికి 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ బ్యాంకింగ్ గ్రూప్ అందించే ఇన్నోవేషన్ అవార్డు వరించింది.
దిల్లీ మెట్రోకు..
ఈ ప్రాజెక్టు నుంచి 24 శాతం విద్యుత్‌ను దిల్లీ మెట్రోకు అందించనున్నారు. మిగిలిన 76 శాతం కరెంట్‌ను రాష్ట్ర విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తారు.
కేంద్ర సహకారంతో..
దేశంలో ఇది మెుట్టమెుదటి సౌర విద్యుత్ ప్రాజెక్టు. 2022కి గాను గిగావాట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతోపాటు 100 గిగావాట్ల సౌర విద్యుత్‌ను సాధించే దిశగా భారత్ కట్టుబడి ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ (ఆర్యూఎంఎస్ఎల్), మధ్యప్రదేశ్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, భారత సోలార్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ పార్క్‌ను నిర్మించాయి. ఈ సోలార్ పార్క్‌ను అభివృద్ధి చేయటానికి కేంద్ర ప్రభుత్వం రేవా సోలార్ కంపెనీకి రూ.138 కోట్లు అందించింది.
ఇదీ చూడండి: 'ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో కీలకంగా భారత్'