అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకొన్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు, భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దిల్లీలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
మూడేళ్ల క్రితం సెప్టెంబర్ 28 రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదంటూ... ఉగ్రవాద శిబిరాలపై భారత జవాన్లు చేసిన మెరుపుదాడులను ప్రధాని గుర్తుచేసుకున్నారు.
"మూడేళ్ల క్రితం.. ఇదే సెప్టెంబరు 28 రాత్రి నేను ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. రాత్రంతా జాగారం చేశాను. టెలిఫోన్ గంట ఎప్పుడు మోగుతుందా అని క్షణక్షణం ఎదురుచూశాను. ఆరోజు భారతీయ వీర జవాన్లు పరాక్రమాన్ని ప్రదర్శించి చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. నా దేశ వీర జవాన్లు మెరుపు దాడులు చేసి భారత వీరత్వాన్ని, పరాక్రమాన్ని, కీర్తిని ప్రపంచానికి తెలియజేశారు. మన వీర జవాన్లు అందరికీ.. వారు చేసిన సాహసానికి కృతజ్ఞతలు, అభినందనలు చెబుతున్నాను.’’ - నరేంద్ర మోదీ, ప్రధాని